8/17/09

మధనం

గుక్క పట్టి ఏడుస్తూ నువ్వు 
లోకంలోకి అడుగెట్టావు కానీ 
ఒక్కొక్కరికీ ఎన్ని నవ్వులు పంచావో 
నీకు తెలియలేదప్పుడు ! 

ప్రతి తప్పటడుగూ నీది 
గతులెరుగని ఒక జలపాతం 
ప్రతి ముద్దు పలుకూ, అది, 
జతికందని ఓ నవరాగం. 

ఊహ తెలియనంత కాలం 
నీ చుట్టే తిరిగిన లోకం 
జరిగిందా నేడు దూరం ? 
అంతేలే జగన్నాటకం ! 

ఇంతింతై పెరిగిన ఙానం 
మలిచిన నీ ఈ పయనంలో 
అడుగడుగున అంటిన మలినం 
హరించింది నీ సంతోషం. 

అనుమానం, స్వాతిశయం, 
ఉద్రేకం, స్వార్ధపరత్వం, 
నీ ఉనికను వృక్షపు మొదలు 
అల్లుకు పెరిగిన పిచ్చి తీగలు ! 

పొరబడకోయ్ రేయని పగలు 
తరచి చూడు మదిలో పొరలు 
తొలగినపుడు తళుకుల తెరలు 
తెల్లనైన మనసే మిగులు 

ఇది బ్రతుకు సంద్రపు నిత్య మధనం - 
తప్పదోయ్ కించిత్ గరళం ! 
ప్రతి అమాస కాదోయ్ గ్రహణం, 
సాగిపోనీయ్ జీవిత గమనం.

2 comments:

Anonymous said...

ఊహ తెలియనంత కాలం
నీ చుట్టే తిరిగిన ప్రపంచం
జరిగిందా నేడు దూరం ?
అంతేలే జగన్నాటకం

these lines are really good. antyaprasa kosam baagaa kashtapaddaaru.. i would say take a small break from writing and read a lot of poetry and then you can find your own style and signature.

వేమన said...

అఙాతగారు,
మీ సూచనకి ధన్యవాదాలు.
ఇప్పటివరకూ నేను చదివిన కవిత్వమల్లా మహాప్రస్థానం ఒక్కటే !
అందుకే ఆ తూగు మత్తులోంచి బైటపడలేక పోతున్నానేమో :)
ఇంకా చదవడానికి ప్రయత్నిస్తాను మీరు చెప్పినట్టు.