5/30/09

ప్రజాస్వామ్యం

మన మాటలు దాటును కోటలు.. మరి గొంగళి వేసిన చోటునె
సర్కారులు మార్చేయగలం.. రోడ్ల గుంటలు పూడ్చలేము
పుట్టుకతో లౌకికవాదులం, ఆ పేరుతో కులమే ఉంటే !

రౌడీలు, సినిమా వాళ్ళు, దళారులు, ఘన వ్యాపారులు
పొషిస్తాం ఎవ్వరినైనా, మన తిండికి లేపోతేనేం ?
మా ఆట మా ఇష్టమంటూ సృష్టిస్తాం బొమ్మలు కొన్ని
అలసత్వం పెరిగే కొద్ది..ఆడుతాము అవి ఆడిస్తే !

అన్నదాత ఉరిపాలైనా, పల్లెలు పల్లెలు మాయం ఐనా
తిండి గింజలు, ఇంటి అద్దెలు, స్కూలు ఫీజులు, మందు బిళ్ళలు
నిరుటికి రెండింతలైనా, మూడింతలైనా

కులమంటూ, ప్రాంతం అంటూ, మతమంటూ, దైవం ఆంటూ
ఏ మంటలు ఎందుకు మండినా, ఎవరెట్లా విషం కక్కినా -

తాపీగా పేపర్ చూస్తాం, వీలుంటే డిస్కస్ చేస్తాం,
మన దాకా రాకపొతే ఓపికగా విశ్లేషిస్తాం
పొరపాటున ఒస్తే మాత్రం, ఎరిగుందాం ఏకాకులమని !

గర్వంగా చాటుకున్న ఈ ప్రజాస్వామ్య ప్రయాణంలో
ఒకరికైనా లక్షలకైనా..అసలంటూ జరిగిన అన్యాయంలో
బాధ్యత మన ప్రతి ఒక్కరిదీ...

ఇప్పటికైనా తెలుసుకుందాం..ప్రజస్వామ్యం అంటే...
ఐదేళ్ళకి ఒక సారి ముద్దర వేసి మిన్నకుండడం కాదు,
ఇది ఒక నిరంతర ఉద్యమం , నిత్య పోరాటం అని !