Showing posts with label అభిప్రాయాలు. Show all posts
Showing posts with label అభిప్రాయాలు. Show all posts

8/27/09

ప్రజాస్వామ్యం - పరిహాసం

"ప్రజలకు చెంది, ప్రజల కోసం, ప్రజల చేత నడుపబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం" అన్నాడో సత్తె కాలపు పెద్ద మనిషి.
మొదట వినగానే "ఆహా , చిటికెలో తేల్చి పారేశాడు, మహా మేధావి" అనుకున్నా. పోను పోను అనిపిస్తోంది, బొత్తిగా అమాయకుడని ! అందుకే, ప్రజాస్వామ్యం అంటే నా దృష్టిలో - ప్రజలకే మోత, కోత, వాత (చేత మాత్రం ఏదీ కనపడట్లా).

ఎందుకిలా అంటున్నానో పెద్దగా అలొచించకుండా అనేశా - ఇప్పుడు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తా !

ప్రజాస్వామ్యం యొక్క మౌలికమయిన ఉద్దేశం ప్రజల చేతిలో అధికారం. దాని మూలంగా ఆత్మ విశ్వాసం. మన పని మనం చేస్కుంటున్నాం, మన సమస్యలు మనం తీర్చుకుంటున్నాం, మన భూత, భవిష్యత్, వర్తమానాలకి మనమే కర్తలం అనే ఒక స్వతంత్ర భావం. చాలా గొప్ప ఆదర్శం, ఎవరు అవునన్నా కాదన్నా.

నేడు అమలులో ఉన్న ప్రజాస్వామ్యపు ముఖ్య లక్షణం - లాబీయింగ్, దళారీ పని. ఎన్నికల్లో ఓటు వేయడంతో సగటు మనిషికి ప్రజస్వామ్యంతో బంధం తెగిపోతుంది. ఆ తర్వాత పడుతూ లేస్తూ బ్రతుకు బండిని వెళ్ళదీస్తూ ఉండడం, ఏ ఉపద్రవమూ ముంచుకు రాకపోతే అదే చాలు భగవంతుడా అని ఒక దణ్ణం పెట్టుకోవడం, అంతే. ఇక కొద్దో గొప్పో తెలివి తేటలో, చైతన్యమో, ఆవేశమో ఉండి జరిగే అన్యాయనికి వ్యతిరేకంగా గొంతూ పెగల్చగలిగే వాళ్ళు ఉంటే చాలు, కొత్త నాయకులు ఈ దళారీల్లోంచే పుట్టుకొస్తారు. తెలివి తేటల్ని డబ్బుతోనూ, ఆవేశాన్ని ఏదో ఒక సెంటిమెంటుతోనూ, కప్పేసి తమ పరమపద సోపానానికి నిచ్చెనలుగా వాడుకుంటారు. మన కులం, మన వర్గం, మన ప్రాంతం, మన మతం, మన రాష్ట్రం, మన దరిద్రం, మన ఆత్మ గౌరవం, మనకి జరిగిన అన్యాయం......ఇలా ఒక్కటేమిటి ఏది పనికొస్తుందనుకుంటే దాన్ని తలకెత్తుకుంటారు. పూట గడిస్తే చాలనుకునేవాడు "ఇది కడుపు నిండిన వాళ్ళ బేరంలే" అని ఒదిలేస్తాడు, తిండి గుడ్డకి లోటు లేని వాళ్ళు మనకెందుకులే అని ఒదిలేస్తారు, కొద్దిగా అభిమానమూ, ఆవేశమూ ఉన్న సున్నిత మనస్కులు వాళ్ళ శక్తిని ధారపోస్తుంటారు, ఈ యఙం ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇది మన దేశంలో పరిస్థితి. ఇక అభివృద్ది చెందిన దేశాల భాగోతం వేరు. అక్కడి ప్రజలు స్వాభావికంగా కొద్దిగా చైతన్యవంతులు కావడం వల్ల వారికి వారు సర్వ సమర్ధులైనట్టు, మిగితా ప్రపంచాన్ని ఉద్ధరించడం వారి కర్తవ్యమైనట్టూ భ్రమింపజేయబడతారు.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, కాపుగాసేవాడికి గొర్రెల మంద ఐతే సుళువు గానీ, లేళ్ళ మంద కాదు. కాబట్టి ఏ బూచి చూపించినా, ఏ విద్వేషాలు రేపినా అది గొర్రెల్ని గొర్రెల్లా ఉంచడానికే. బీడీ కట్ట మీద పుర్రె గుర్తు దగ్గరనించి మైనారిటీలకి కొత్త రిజర్వేషన్ల వరకూ, అన్నిటా అంతటా అదే తంతు.

ఎప్పుడయినా దేన్లోనైనా మంచి చెడుల ప్రస్తావన రాగానే 'నాణేనికి ఇరువైపులా' అంటారు...శుద్ధ అబద్దం. అంత సమానత్వమెక్కడ ఏడ్చింది? ఇది కలికాలం మరి! అలాంటి పోలిక నన్నడిగితే, నాణెం అనను... గోళం అంటాను. అది నేలకి ఆనినంత పిసర మాత్రమే మంచి, మిగితా అంతా చెడు !

ఇంత రాసిన తరవాత ఇప్పుడు, నా పాత రాతలకే మళ్ళీ వ్యాఖ్యానం రాసుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎలాగూ ఇంత చదివారు కాబట్టి ఇటు కూడా ఒక లుక్కెయ్యండి.

నక్కల కొలువులో గొర్రెలం ఎలా ఉండాలో ఇంకో టపాలో రాసే ధైర్యం చేస్తాను.
అందాకా శెలవ్.

6/21/09

నొక్కి వక్కాణించినంతన చిక్కెటులని తర్కించుచు చెవులు రిక్కించిన, చిక్కిన నా ప్రక్కవాని జూచి నేనిట్లనియె !

నేను స్కూల్లో ఉన్నప్పుడు మా లెక్కల మాష్టారు Redundancy గురించి ఇలా చెప్పేవారు...

ఎవరో ఒకాయిన తన గొడుగు మీద ' రమణారావు గారు ' అని రాయించుకుని అది వేసుకుని వెళ్తున్నాట్ట. అది చూసి కొంత మంది పోకిరి పిల్లలు వెనకాల పడి......
' రమణారావు గారు గారు ' అని ఏడిపించడం మొదలు పెట్టారుట.

ఒక విషయాన్నో అభిప్రాయాన్నో కుండ బద్దలు కొట్టినట్టో, కొండ బద్దలు కొట్టినట్టో చెప్పడం తప్పు కాదు, మంచిది కూడా.. కానీ అదే కుండని మళ్ళీ మళ్ళీ బద్దలు కొడితేనే ఒస్తుంది చిక్కంతా ! ముందొక మార్కో ముద్రో పడుతుంది.. ఆ తర్వాత మనం ' నొక్కి వక్కాణించిన ' విషయాన్ని ఒదిలేసి దాన్నొక జబ్బుగానో, తెగులుగానో, పిచ్చి గానో అనుకోవడం, చూపించడం, వెక్కిరించడం జరుగుతుంది. ఇది నేను చిన్నప్పటి నించీ చూసినదే.

కావున మిత్రమా ... ' కడ వరకుంగట్టుబడు క్రమమునందున్ దక్క తక్కిన కడ నెక్కడనున్నొక్కటి కంటెను మార్లు నొక్కి వక్కాణించినంతన జిక్కిటులగునే ! '

7/2/08

అనుభవం

మనం కలిసే ప్రతి మనిషిలో మన లక్షణాలు ఒకటో రెండో.. కనిపించడం... ఎక్కువగా అవి మనలో మనకే నచ్చనివిగా ఉండడం...
ఒకప్పుడు మనం చేసిన పనులు.. ఆ సమయంలో ఎంత సబబుగా కనిపించాయో... ఇప్పుడు అంత కంటే తప్పుగా అనిపించడం...
ఒకప్పుడు ఎంతో ముఖ్యంగా అనిపించిన విషయాలు.. ఇప్పుడు చిన్నవిగా కనిపించడం...

6/22/08

తెలుగు వాడు గర్వపడే వేళ....

తెలుగు వాళ్ళు నిజంగానే గర్వ పడాలి.... ప్రాచీనత సంగతి సరే... ఈ రోజుల్లో కూడా... ఎందుకంటే...
ఆత్రేయ...
" అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని..
జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే మనిషి పని.."
" గురుతు చెరిపి వేసి జీవించాలని... చెరపలేకపోతే మరణించాలని..
తెలిసి కూడా చెయ్యలేని వెర్రి వాడిని..గుండె పగిలి పోవు వరకు నన్ను పాడనీ..
ముక్కల లో లెక్కలేని రూపాలలో .. మరల మరల నిన్ను చూసి రోదించనీ..."
వేటూరి...
" పదములు తామే ... పెదవులు కాగా.. గుండియలే...అందియలై... మ్రోగ...."
సిరివెన్నెల...
" అలల పెదవులతో.. శిలల చెక్కిలి ఫై.. కడలి ముద్దిడు వేళ...
పుడమి హృదయంలో...
ఉప్పొంగి సాగింది అనురాగము... ఉప్పెనగ మారింది ఆ రాగము..."

ఇవి వీళ్ళ బెస్ట్ వర్క్స్ కావు.. మచ్చుక్కి.. నేను ఎంచినవి .. ఏది తీసుకున్నా ఒక స్థాయి కి తగ్గకుండా ఉండడం చాలా గొప్ప విషయం...తెలుగు సినిమా సాహిత్యానికి ఒక గౌరవాన్ని చిర స్థాయిగా సంపాదించి పెట్టిన వాళ్ళందరినీ చూసి మనం నిజంగానే గర్వపడాలి...ఎందుకంటే... ఇవాల్టి రోజున.. సినిమా అనేది.. సగటు మనిషి దృష్టిలో
ఆ భాష సాహిత్యానికి కొలబద్ద.