Showing posts with label పైత్యం. Show all posts
Showing posts with label పైత్యం. Show all posts

8/28/09

కవి కిశోర్ VS నానుడి నగేష్

కవి కిశోర్ ప్రకృతిని చూసి మైమరచి ఒక కవిత రాసుకుని నానుడి నగేష్ దగ్గరకి ఒచ్చాడు.

బ్రదర్, ఈ వానలో ప్రకృతిని చూసి నాకో కవిత తట్టింది... చెప్పమంటావా ?
ఆగాగు.

ఏమయింది ?
నాకోటి గుర్తొచ్చింది.

ఒహో, నీ మనసుని కూడా ఏదో కదిలించినట్టుందే, చెప్పు చెప్పు వింటాను.
ఆదిలోనే హంసపాదు...హిహిహిహి.

ఏడిచినట్టుంది, ఇప్పుడు నేను చెప్తా విను.
"అరెరే నింగికి పొలమారినట్టుంది పదే పదే ఉరుముతోందీవేళ"
మరే, ఆవులింతకి అన్న ఉన్నాడు గానీ తుమ్ముకి తమ్ముడు లేడన్నారు, దగ్గు గురించేం చెప్పలేదు ఎందుకంటావ్!

ఆహా..ఏదో ఒకటి లే, విను ముందు.
"రాలే ఈ చినుకులన్నీ నేలని తాకలేని నింగి కన్నీళ్ళేమో !"
ఏమో, లోగుట్టు పెరుమాళ్ళకెరుక !

!!!. సర్లే విను..
"ఆ చినుకులన్ని వేస్తాయి పుడమి హృదయంలో
తీపీ ఙాపకపు చివుళ్ళు
అవి అవుతాయి మహా వృక్షాలు".
ఆహా..మరి మొక్కై వంగనిది మానై వంగుతుందంటావా ?

సోదాపి ముందు పూర్తిగా విను, లేకపోతే అర్ధం కాదు.
"నేల ప్రేమని తాగి పెరిగిన ఆ వృక్షాలు
తల పైకెత్తి చూస్తుంటాయి నింగివైపు
తమ కొమ్మల చేతులూపి
పిలుస్తుంటాయి రారమ్మని."
ఒహో, డోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకుంటోందనమాట.

"అది చూసి గుండె కరిగిన ఆకాశం
తిరిగి రెండు కన్నీటి బొట్లు రాలుస్తుంది."
భలే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందే.

ఇంతకీ ఎలా ఉంది నా కవిత ?
చాప కింద నీరులా ఉంది

అదేం పోలిక నా బొంద. నిన్నేమనాలో అర్దం కావట్లా.
నిన్ను ఇంతైనా కదిలించలేదా నా కవిత ?
నిండు కుండ తొణకదు.

ఏం బాలేదు చెప్పు దీంట్లో ?
ఆన్నీ తెలిసినవాడికి ఎవరూ చెప్పక్కర్లేదు
ఏమీ తెలీనివాడికి చెప్పినా అర్ధం కాదు.


అసలు కవిత చెప్పడానికి నీ దగ్గరకొచ్చాను చూడు, నాకుండాలి బుధ్ధి.
బుధ్ధి కర్మానుసారిణి.

ఒహో మళ్ళీ వేదాంతం కుడానా..మరి కర్మ ?
ఎవరి కర్మకు వారే కర్తలు.

అబ్బో...మరి కర్త ?
చేసుకున్న వాడికి చేసుకున్నంత.

తిప్పి తిప్పి అదే చెప్తున్నావు..నీకు నా కవిత్వం ఏం అర్ధం అవుతుందిలే !
పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని ఎవరూ చూడట్లేదనుకుందిట, నువ్వు మాత్రం తిప్పి తిప్పి వాన పడుతోందనేగా చెబుతున్నావు.

అంటావ్ అంటావ్, ఎన్నైనా అంటావ్....పళ్ళ చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు.
హిహిహి... కవితలకి చింతకాయలు రాలవు మరి.

ఏమిటా ఇకిలింపు ...నవ్వ్వు నాలుగు విధాల చేటన్నారు.
హిహిహిహిహిహిహిహి....

ఛీ,...నీ సామెతల జబ్బు నాక్కూడా అంటుకుంది.
!@%$^*(()*^%%$$##$
ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు.

%$$%&*((&*^%$*&%&!!
ఛస్తే నీ మొహం చూడను ఇంక..
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.

&&*%^&%&%$^%$^&

7/30/09

చేసింది నా మనసు గుల్ల !

కొన్ని నెలలయింది, నే చూడబట్టి,
అయినా ఎందుకో కొత్తే ఇంకా!
కనబడినప్పుడల్లా పిలుద్దాం అనుకుంటాను,
ఈ లోపు ఎవరో వచ్చి చెడగొడతారు.

క్రితం సారి రుచి మరపు రావట్లేదు,
ఎంత ప్రయత్నించినా మళ్ళీ దొరకట్లేదు.
నవ్వుతూ తుళ్ళుతూ ఎక్కడో మాట్లాడుతుందే తప్ప
నా వైపు మాత్రం అసలు రావట్లేదు !

ఏమనుకుంటారో కాదంటేనని,
తలాడించా అడిగిన అందరికీ,
ఈ రోజు మాత్రం ఇలా కుదరదని ,
వేలు చూపించా తన వైపుకి,
'జన్మ ధన్యమైంద'ని ఎందుకంటారో
తెలుసుకున్నా నేనీ దెబ్బకి !

అదే నవ్వుతో మళ్ళీ వచ్చింది,
నేనడిగింది అలాగే ఇచ్చింది,
అసలా చేతిలో ఏం మహిముందోననే
ఆశ్చర్యం నాకు మిగిల్చింది -
చేసిందిలా నా మనసు గుల్ల,
మా లోకల్ కాఫీషాపు పిల్ల !