9/18/09

భావం

తలవని తలపుగ మెదిలిన మొదలుగ
తరలుతు తరుముతు కదిలిన పద ఝరి
పరుగుల వరదలు వలపుల మధువుల,
తగవుల, వగపుల, మురిసిన నగవుల,
తడిసిన కన్నుల, తెలియని తపనల
తడబడు అడుగుల తిరిగిన దారుల
పరి పరి మలుపుల ఎగసిన నురగల
నిండిన బుడగలు భారమునోపక
పగిలిన తొలుతనె వెలువడు వాయువు
వెడలిన తీరుగ భావము విడివడె, భాషకు బలిపడి!

తగదని తెలిసిన తరుణపు తదుపరి
అటు ఇటు వెదికిన మనసుకు తోచెను
గాలికి రెప రెపలాడిన దీపపు,
కనురెప్పలు చేసిన టప టప చప్పుడు.
హోరు గాలిలో దాగు నిశబ్దం,
నీడల నలుపుల వెనుకన వెలుగు,
తొలగిన పద బంధముల సాక్షిగా !

2 comments:

మరువం ఉష said...

"కనురెప్పలు చేసిన టప టప చప్పుడు.
హోరు గాలిలో దాగు నిశబ్దం"

వూహించుకుంటే ఈ భావన మాటలకతీతం.

వేమన said...

ఉషగారూ, స్వాగతం!
మీరన్నదే ఈ కవిత పరమార్ధం, కొన్ని భావాలకి మాటలు దొరకవు.