కవి కిశోర్ ప్రకృతిని చూసి మైమరచి ఒక కవిత రాసుకుని నానుడి నగేష్ దగ్గరకి ఒచ్చాడు.
బ్రదర్, ఈ వానలో ప్రకృతిని చూసి నాకో కవిత తట్టింది... చెప్పమంటావా ?
ఆగాగు.
ఏమయింది ?
నాకోటి గుర్తొచ్చింది.
ఒహో, నీ మనసుని కూడా ఏదో కదిలించినట్టుందే, చెప్పు చెప్పు వింటాను.
ఆదిలోనే హంసపాదు...హిహిహిహి.
ఏడిచినట్టుంది, ఇప్పుడు నేను చెప్తా విను.
"అరెరే నింగికి పొలమారినట్టుంది పదే పదే ఉరుముతోందీవేళ"
మరే, ఆవులింతకి అన్న ఉన్నాడు గానీ తుమ్ముకి తమ్ముడు లేడన్నారు, దగ్గు గురించేం చెప్పలేదు ఎందుకంటావ్!
ఆహా..ఏదో ఒకటి లే, విను ముందు.
"రాలే ఈ చినుకులన్నీ నేలని తాకలేని నింగి కన్నీళ్ళేమో !"
ఏమో, లోగుట్టు పెరుమాళ్ళకెరుక !
!!!. సర్లే విను..
"ఆ చినుకులన్ని వేస్తాయి పుడమి హృదయంలో
తీపీ ఙాపకపు చివుళ్ళు
అవి అవుతాయి మహా వృక్షాలు".
ఆహా..మరి మొక్కై వంగనిది మానై వంగుతుందంటావా ?
సోదాపి ముందు పూర్తిగా విను, లేకపోతే అర్ధం కాదు.
"నేల ప్రేమని తాగి పెరిగిన ఆ వృక్షాలు
తల పైకెత్తి చూస్తుంటాయి నింగివైపు
తమ కొమ్మల చేతులూపి
పిలుస్తుంటాయి రారమ్మని."
ఒహో, డోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకుంటోందనమాట.
"అది చూసి గుండె కరిగిన ఆకాశం
తిరిగి రెండు కన్నీటి బొట్లు రాలుస్తుంది."
భలే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందే.
ఇంతకీ ఎలా ఉంది నా కవిత ?
చాప కింద నీరులా ఉంది
అదేం పోలిక నా బొంద. నిన్నేమనాలో అర్దం కావట్లా.
నిన్ను ఇంతైనా కదిలించలేదా నా కవిత ?
నిండు కుండ తొణకదు.
ఏం బాలేదు చెప్పు దీంట్లో ?
ఆన్నీ తెలిసినవాడికి ఎవరూ చెప్పక్కర్లేదు
ఏమీ తెలీనివాడికి చెప్పినా అర్ధం కాదు.
అసలు కవిత చెప్పడానికి నీ దగ్గరకొచ్చాను చూడు, నాకుండాలి బుధ్ధి.
బుధ్ధి కర్మానుసారిణి.
ఒహో మళ్ళీ వేదాంతం కుడానా..మరి కర్మ ?
ఎవరి కర్మకు వారే కర్తలు.
అబ్బో...మరి కర్త ?
చేసుకున్న వాడికి చేసుకున్నంత.
తిప్పి తిప్పి అదే చెప్తున్నావు..నీకు నా కవిత్వం ఏం అర్ధం అవుతుందిలే !
పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని ఎవరూ చూడట్లేదనుకుందిట, నువ్వు మాత్రం తిప్పి తిప్పి వాన పడుతోందనేగా చెబుతున్నావు.
అంటావ్ అంటావ్, ఎన్నైనా అంటావ్....పళ్ళ చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు.
హిహిహి... కవితలకి చింతకాయలు రాలవు మరి.
ఏమిటా ఇకిలింపు ...నవ్వ్వు నాలుగు విధాల చేటన్నారు.
హిహిహిహిహిహిహిహి....
ఛీ,...నీ సామెతల జబ్బు నాక్కూడా అంటుకుంది.
!@%$^*(()*^%%$$##$
ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు.
%$$%&*((&*^%$*&%&!!
ఛస్తే నీ మొహం చూడను ఇంక..
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.
&&*%^&%&%$^%$^&
8/28/09
8/27/09
ప్రజాస్వామ్యం - పరిహాసం
"ప్రజలకు చెంది, ప్రజల కోసం, ప్రజల చేత నడుపబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం" అన్నాడో సత్తె కాలపు పెద్ద మనిషి.
మొదట వినగానే "ఆహా , చిటికెలో తేల్చి పారేశాడు, మహా మేధావి" అనుకున్నా. పోను పోను అనిపిస్తోంది, బొత్తిగా అమాయకుడని ! అందుకే, ప్రజాస్వామ్యం అంటే నా దృష్టిలో - ప్రజలకే మోత, కోత, వాత (చేత మాత్రం ఏదీ కనపడట్లా).
ఎందుకిలా అంటున్నానో పెద్దగా అలొచించకుండా అనేశా - ఇప్పుడు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తా !
ప్రజాస్వామ్యం యొక్క మౌలికమయిన ఉద్దేశం ప్రజల చేతిలో అధికారం. దాని మూలంగా ఆత్మ విశ్వాసం. మన పని మనం చేస్కుంటున్నాం, మన సమస్యలు మనం తీర్చుకుంటున్నాం, మన భూత, భవిష్యత్, వర్తమానాలకి మనమే కర్తలం అనే ఒక స్వతంత్ర భావం. చాలా గొప్ప ఆదర్శం, ఎవరు అవునన్నా కాదన్నా.
నేడు అమలులో ఉన్న ప్రజాస్వామ్యపు ముఖ్య లక్షణం - లాబీయింగ్, దళారీ పని. ఎన్నికల్లో ఓటు వేయడంతో సగటు మనిషికి ప్రజస్వామ్యంతో బంధం తెగిపోతుంది. ఆ తర్వాత పడుతూ లేస్తూ బ్రతుకు బండిని వెళ్ళదీస్తూ ఉండడం, ఏ ఉపద్రవమూ ముంచుకు రాకపోతే అదే చాలు భగవంతుడా అని ఒక దణ్ణం పెట్టుకోవడం, అంతే. ఇక కొద్దో గొప్పో తెలివి తేటలో, చైతన్యమో, ఆవేశమో ఉండి జరిగే అన్యాయనికి వ్యతిరేకంగా గొంతూ పెగల్చగలిగే వాళ్ళు ఉంటే చాలు, కొత్త నాయకులు ఈ దళారీల్లోంచే పుట్టుకొస్తారు. తెలివి తేటల్ని డబ్బుతోనూ, ఆవేశాన్ని ఏదో ఒక సెంటిమెంటుతోనూ, కప్పేసి తమ పరమపద సోపానానికి నిచ్చెనలుగా వాడుకుంటారు. మన కులం, మన వర్గం, మన ప్రాంతం, మన మతం, మన రాష్ట్రం, మన దరిద్రం, మన ఆత్మ గౌరవం, మనకి జరిగిన అన్యాయం......ఇలా ఒక్కటేమిటి ఏది పనికొస్తుందనుకుంటే దాన్ని తలకెత్తుకుంటారు. పూట గడిస్తే చాలనుకునేవాడు "ఇది కడుపు నిండిన వాళ్ళ బేరంలే" అని ఒదిలేస్తాడు, తిండి గుడ్డకి లోటు లేని వాళ్ళు మనకెందుకులే అని ఒదిలేస్తారు, కొద్దిగా అభిమానమూ, ఆవేశమూ ఉన్న సున్నిత మనస్కులు వాళ్ళ శక్తిని ధారపోస్తుంటారు, ఈ యఙం ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇది మన దేశంలో పరిస్థితి. ఇక అభివృద్ది చెందిన దేశాల భాగోతం వేరు. అక్కడి ప్రజలు స్వాభావికంగా కొద్దిగా చైతన్యవంతులు కావడం వల్ల వారికి వారు సర్వ సమర్ధులైనట్టు, మిగితా ప్రపంచాన్ని ఉద్ధరించడం వారి కర్తవ్యమైనట్టూ భ్రమింపజేయబడతారు.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, కాపుగాసేవాడికి గొర్రెల మంద ఐతే సుళువు గానీ, లేళ్ళ మంద కాదు. కాబట్టి ఏ బూచి చూపించినా, ఏ విద్వేషాలు రేపినా అది గొర్రెల్ని గొర్రెల్లా ఉంచడానికే. బీడీ కట్ట మీద పుర్రె గుర్తు దగ్గరనించి మైనారిటీలకి కొత్త రిజర్వేషన్ల వరకూ, అన్నిటా అంతటా అదే తంతు.
ఎప్పుడయినా దేన్లోనైనా మంచి చెడుల ప్రస్తావన రాగానే 'నాణేనికి ఇరువైపులా' అంటారు...శుద్ధ అబద్దం. అంత సమానత్వమెక్కడ ఏడ్చింది? ఇది కలికాలం మరి! అలాంటి పోలిక నన్నడిగితే, నాణెం అనను... గోళం అంటాను. అది నేలకి ఆనినంత పిసర మాత్రమే మంచి, మిగితా అంతా చెడు !
ఇంత రాసిన తరవాత ఇప్పుడు, నా పాత రాతలకే మళ్ళీ వ్యాఖ్యానం రాసుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎలాగూ ఇంత చదివారు కాబట్టి ఇటు కూడా ఒక లుక్కెయ్యండి.
నక్కల కొలువులో గొర్రెలం ఎలా ఉండాలో ఇంకో టపాలో రాసే ధైర్యం చేస్తాను.
అందాకా శెలవ్.

వర్గాలు:
అభిప్రాయాలు,
ప్రజాస్వామ్యం
8/24/09
Food, Inc
'FOOD,INC'- ఈ డాక్యుమెంటరీ సినిమా ఏం చూస్తాం రా బాబూ అంటూ నీలుగుతున్న ఒక ఫ్రెండ్ ని బలవంతంగా లాక్కుని వెళ్ళాం నిన్న. మొదటి ఐదు నిమిషాలవగానే వాడు ఫీలవడం ఆపేశాడు. అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళకి కొన్ని నచ్చని shocking విషయాలు ఉన్నాయందులో.
నాకు అర్ధం ఐనవరకూ సారాంశం ఇది -
1930లలో చిన్న చిన్నగా మొదలైన అమెరికన్ ఫుడ్ ఇండస్ట్రీ, పోను పోను ఊహించనంత భారీగా ఎదిగింది.
ఎక్కడ చూసినా MCDonalds, KFC లాంటి Chains వెలిశాయి. జనాలని ఆకర్షించడానికీ పోటీ పడి ధరలు తగ్గించాయి. ఊహించినట్టుగానే Demand పెరగడంతో ఈ ధరలు తక్కువగా ఉంచుతూనే ఎక్కువ మాంసం ఉత్పత్తి చెయ్యల్సిన అవసరం ఏర్పడింది. Smithfield, Cargill లాంటి Meat Producing కంపెనీలు తక్కువ ఖర్చుతో త్వరగా మాంసం ఉత్పత్తి చెయ్యడానికి మార్గాలు అన్వేషించాయి. ఈ ప్రయత్నంలో వాళ్ళకి దొరికిన అద్భుతం(వారి దృష్టిలో) మొక్కజొన్న !
లాభాపేక్షతో కళ్ళు మూసుకుపొయి, స్వాభావికంగా గడ్డి తిని పెరిగే ఆవుల చేత మొక్కజొన్న తినిపించడం మొదలుపెట్టారు. కోళ్ళకీ, పందులకీ పెట్టే ఆహారంలో కూడా మొక్కజొన్న భాగం అయిపొయింది. High Energy Diet వల్ల ఈ జంతువులన్నిటి పరిమాణం రెండింతలు పెరిగింది. ఆవి ఎదిగే కాలం సగానికి తగ్గిపోయింది. కానీ, అపసవ్య ఎదుగుదల కారణాన కోళ్ళ ఎముకలు వాటి బరువుని మొయ్యలేక చతికిలపడడం, శరీరం అరాయించుకోలేని తిండి వల్ల ఆవుల, పందుల కడుపులో బాక్టీరియా(E-Coli) చేరడం, బోనస్ గా ఒచ్చే విషయాలు.
ఇవన్నీ చాలక 'ఇందు గలడందు లేడని లేన'ట్లుగా Coke, Pepsi నించి సాలాడ్ డ్రెస్సింగ్ దాకా మొక్కజొన్న ఉత్పత్తులు లేని వస్తువు లేదంటే ఆశ్చర్యం వేసింది. "ఇక్కడ బీఫ్ తిన్నా, పోర్క్ తిన్నా, చికెన్ తిన్నా, పాలకూర తిన్నా అంతా చివరికి మొక్కజొన్నేనన్నా" అని పాడుకోవాలేమో :)
విస్తృతంగా కవర్ చెయ్యనప్పటికీ, తేనేతుట్టె లాంటి ఈ విషయాన్ని కదిలించే ధైర్యం చేసినందుకు, ఇది అభినందించదగ్గ ప్రయత్నం. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ సినిమా తప్పకుండా చూడండి, ఆ లోపల ఈ లింక్ చూడండి.
8/18/09
ఆకాశం
చీకటి చీరన
చుక్కల తళుకులు
నీల మేఘపు
మేలి ముసుగులు
జాబిలి వెలుగుల
చిరు చిరు నగవులు
సంధ్య వేళల
సిగ్గుల ఎరుపులు
నుదుటిన రవి
సింధూరపు కళలు
వెలుపల మబ్బుల
దూది పింజలు
వెనుకన
నీలి గంభీరాలు
ఉరుముల మెరుపుల
మూతి విరుపులు
స్వాతి చినుకులై
కురిసిన ప్రేమలు
మురిసిన వేళల
ఆ హరివిల్లులు,
ఏమని చెప్పను నింగి సొగసులు !
వర్గాలు:
కవిత్వం
8/17/09
మధనం
లోకంలోకి అడుగెట్టావు కానీ
ఒక్కొక్కరికీ ఎన్ని నవ్వులు పంచావో
నీకు తెలియలేదప్పుడు !
ప్రతి తప్పటడుగూ నీది
గతులెరుగని ఒక జలపాతం
ప్రతి ముద్దు పలుకూ, అది,
జతికందని ఓ నవరాగం.
ఊహ తెలియనంత కాలం
నీ చుట్టే తిరిగిన లోకం
జరిగిందా నేడు దూరం ?
అంతేలే జగన్నాటకం !
ఇంతింతై పెరిగిన ఙానం
మలిచిన నీ ఈ పయనంలో
అడుగడుగున అంటిన మలినం
హరించింది నీ సంతోషం.
అనుమానం, స్వాతిశయం,
ఉద్రేకం, స్వార్ధపరత్వం,
నీ ఉనికను వృక్షపు మొదలు
అల్లుకు పెరిగిన పిచ్చి తీగలు !
పొరబడకోయ్ రేయని పగలు
తరచి చూడు మదిలో పొరలు
తొలగినపుడు తళుకుల తెరలు
తెల్లనైన మనసే మిగులు
ఇది బ్రతుకు సంద్రపు నిత్య మధనం -
తప్పదోయ్ కించిత్ గరళం !
ప్రతి అమాస కాదోయ్ గ్రహణం,
సాగిపోనీయ్ జీవిత గమనం.
వర్గాలు:
కవిత్వం
8/11/09
ఎందుకు ?
మనిషి మనుగడను అడివి దారిన
మధ్య నిలిచిన ప్రతి చెట్టూ
మిగిలిపోయిన ప్రశ్నై మదిలో
మెదులుతూ ఉంది
బలముంటేనే బ్రతకగలిగిన
నాటి నీతే నమ్ముకుంటే
బట్ట కట్టిన మనిషికింకా
బుద్ధి లేదే ఎందుకు ?
పుడమి కోసం పడతి కోసం
పారిన రక్తపుటేరుల
పరుగుల గమ్యం
ఇంకా తెలియలేదు ఎందుకు ?
మనిషి మీద మనిషి జులుం
బానిసత్వమంటు అరిచి
పోరాడి బావుకుంది మళ్ళీ
డబ్బుకు దాస్యమే అయితే
ఆ చేసిన పోరాటమెందుకు ?
గెలుచుకున్న స్వేచ్ఛెందుకు ?
కళ్ళ ముందే కూలుతున్న
సాటి బ్రతుకుని నిలుపలేని,
కాలుతున్న కడుపు నింప
పట్టెడన్నం పెట్టలేని
కులం కోసం మతం కోసం
కొత్తలోకపు మైకం కోసం సాగే
నిత్య మారణహోమమెందుకు ?
జనం వెతలు తీర్చలేని
ప్రభంజనం ఎందుకు ?
ప్రజల గోడు పట్టని
పిడివాదం ఎందుకు ?
నిజం తీరు మార్చలేని
ఇజం మాత్రం ఎందుకు ?
వర్గాలు:
కవిత్వం
8/7/09
ఒక తార గెలుపు
తెరిపార చూశానోసారి, తళుకుమన్న తారల్ని,
తప్పదనుకున్నాను, తెర వెనుక ఉన్నవాణ్ణి కాస్తా
తెగించి బైటకొచ్చాను
ఓ చిన్న వెలుగు వెనుకెన్నెన్ని మంటలో
ఊహించగలిగినా ఒప్పుకోని మనసు
నా వెలుగు కూడా నన్ను వెతుక్కోమంది
తప్పొప్పుల నడుమ తలుపుల్ని తర్కంతో బద్దలుకొట్టి
తుఫాను గాలిలా నేను దూసుకెళ్ళాను, తారనయ్యాను.
అంతెత్తు నుండి మరుగుజ్జు ప్రపంచాన్ని చూసి నవ్వుకున్నాను.
పాతబడిన కొద్దీ విచ్చుకున్న నవ్వు వాడిపోయింది,
చుట్టూ చూశాను, మంటలే కనిపించాయి, దిక్కు తోచలేదు !
అందరిలానే ఉన్నా, ఉన్నచోటే ఒంటరిగా
ఆశగా చూస్తున్నాను నేల వైపు,
అక్కడ్నించే కాలు మోపుదామని !
కుదరదని తెలిసీ మొగ్గలేయించే మనసు,
అదే జరగని నాడు తనే చెబుతుంది,
ఆ రోజు నిజంగా మళ్ళీ నవ్వుతూ,
ఆనందంగా రాలిపోతాను, కనుమరుగౌతాను !
వర్గాలు:
కవిత్వం
8/4/09
తేడా ఎముంది, తీరు మారిందే తప్ప ?
పొట్ట నింపుకోడానికి తనని తరిమిన ఒక ఆరాటం,
పగబట్టిన ప్రకృతితో దిన దినమూ పోరాటం,
ఆపలేక ఓపలేక ఊగిసలాడిన మనిషికి,
బ్రతకగలగడమే నాడు గెలుపంటే అర్ధం.
ఆశల ఎండమావులకై ఆపక పరిగెడుతున్న వాటం,
తనే పొగబెట్టిన ప్రకృతితో ప్రతి నిత్యం పోరాటం,
తగదనో తప్పదనో తేల్చుకోలేని మనిషికి,
గెలవగలగడమే నేడు బ్రతుకుకి పరమార్ధం.
తేడా ఎముంది, తీరు మారిందే తప్ప ?
పగబట్టిన ప్రకృతితో దిన దినమూ పోరాటం,
ఆపలేక ఓపలేక ఊగిసలాడిన మనిషికి,
బ్రతకగలగడమే నాడు గెలుపంటే అర్ధం.
ఆశల ఎండమావులకై ఆపక పరిగెడుతున్న వాటం,
తనే పొగబెట్టిన ప్రకృతితో ప్రతి నిత్యం పోరాటం,
తగదనో తప్పదనో తేల్చుకోలేని మనిషికి,
గెలవగలగడమే నేడు బ్రతుకుకి పరమార్ధం.
తేడా ఎముంది, తీరు మారిందే తప్ప ?
వర్గాలు:
కవిత్వం
Subscribe to:
Posts (Atom)