9/18/09

భావం

తలవని తలపుగ మెదిలిన మొదలుగ
తరలుతు తరుముతు కదిలిన పద ఝరి
పరుగుల వరదలు వలపుల మధువుల,
తగవుల, వగపుల, మురిసిన నగవుల,
తడిసిన కన్నుల, తెలియని తపనల
తడబడు అడుగుల తిరిగిన దారుల
పరి పరి మలుపుల ఎగసిన నురగల
నిండిన బుడగలు భారమునోపక
పగిలిన తొలుతనె వెలువడు వాయువు
వెడలిన తీరుగ భావము విడివడె, భాషకు బలిపడి!

తగదని తెలిసిన తరుణపు తదుపరి
అటు ఇటు వెదికిన మనసుకు తోచెను
గాలికి రెప రెపలాడిన దీపపు,
కనురెప్పలు చేసిన టప టప చప్పుడు.
హోరు గాలిలో దాగు నిశబ్దం,
నీడల నలుపుల వెనుకన వెలుగు,
తొలగిన పద బంధముల సాక్షిగా !

9/8/09

కలత నిద్ర



గుర్తు తెలియని దృశ్యాలేవో కొట్టుకుంటున్న అలికిడికి
ఉన్నట్టుండి రెప్పల తలుపులు తెరుచుకున్నాయి.

ఆపకుండా సుళ్ళు తిరిగిన చెవిలోని శబ్దాలన్నీ
తెరుచుకున్న కళ్ళలోంచి జారుకున్నాయి.

లేని పోని ఊహల్లో రేయంతా ఊయలూగిన మనసు
శరీరపు పంజరంలో తిరిగి బందీ అయింది.

తను అలసిపోయి సోలిన వేళ మనసు చేసిన అల్లరికి
రోజంతా ఒళ్ళు ఇప్పుడు పగ తీర్చుకుంటోంది.

రెంటి బాధా తెలిసీ, నేనెవరో తెలియక
సంధి కోసం మౌనంగా ఎదురు చూస్తున్నాను