11/18/09

అవ్యక్తం

ఆకుల భేషజాలని రాల్చేసి
తేలికపడి చెట్టు నిలుచుంది.
తగని తలపులన్నీ తలకెత్తుకుని,
బరువెక్కి నేను చూస్తున్నాను.

గమ్యపు రుచి మరిగిన కాట్ల కుక్కల్లా
కార్లు పరిగెడుతున్నాయి.
జీవితమే ఒక మజిలీ అని ఎందుకన్నారో
అన్న ప్రశ్న మెదిలింది.

పక్షుల గుంపొకటి పైకెగసి
నింగికొక హంగునద్దింది.
ఉన్నదున్నట్టు చూడలేని నేను,
ఆ రూపు పోల్చుకోజూసాను !

ఆకాశ విన్యాసం అంతలో ఆపేసి,
తానే వలగా మారిన
ఆ గుంపుకి ఓ చెట్టు చిక్కింది.

మనుషులపై మాయల వల విసిరిన
జాలరి కోసం తరచి చూశాను !

చలిగాలి తాకిడికి స్పర్శ కోల్పోయాను
వెలుపలి హోరుకి మది సద్దు మణిగింది
ఎక్కడినించో ఒక అవ్యక్త మకరందం
నేరుగా నా గుండెలోకి ఇంకింది,
తన ఉనికిని తెలిపింది,
నా ముఖాన ఒక మందహాసమై నిలిచింది !

3 comments:

భావన said...

నేలని పట్టుకు వేళ్ళాడే మన జీవుల వల
విసిరిన ఆ జాలరి కోసం తరచి చూశాను !
ఇక్కడ ఏదో కంటిన్యుటి రాలేదు.. మిగతాది అంతా చాలా బాగుంది.
చలిగాలి తాకిడికి స్పర్శ కోల్పోయాను
వెలుపలి హోరుకి మది సద్దు మణిగింది

వేమన said...

భావనగారు - ధన్యవాదాలు. నాకు కూడా అలాగే అనిపించి మార్చేసాను.

cartheek said...

super vemana gaaru.