12/2/09

నోస్టాల్జియా



కనిపించే ప్రతి అందాన్నీ
బంధించబోయిన
చూపుల తాళ్ళని తెంపుకుంటూ
బండి తరలిపోతోంది
నా ఆనందం ఇంధనంగా
స్మృతుల ధూమం, సాక్షిగా !

ఉన్నపాటున అగితే ఎంత బావుణ్ణో
మొదటినించీ వస్తే, అంతకన్నా !
ఎందుకో మరి - పయనమాగదు,
ఆశ చావదు !

అక్కడే ఆగడం సృష్టి ధర్మం కాదో
మళ్ళీ మొదలంటే అర్ధమే ఉండదో
పయనం ఎందుకో, గమ్యం ఏమిటో
అన్న తలపుల ఆటుపోట్లకి
మదిలో ఎగసే అలలని,
రెప్పలు వాల్చేసి ఇలా
కప్పేయజూస్తాను.

11/18/09

అవ్యక్తం

ఆకుల భేషజాలని రాల్చేసి
తేలికపడి చెట్టు నిలుచుంది.
తగని తలపులన్నీ తలకెత్తుకుని,
బరువెక్కి నేను చూస్తున్నాను.

గమ్యపు రుచి మరిగిన కాట్ల కుక్కల్లా
కార్లు పరిగెడుతున్నాయి.
జీవితమే ఒక మజిలీ అని ఎందుకన్నారో
అన్న ప్రశ్న మెదిలింది.

పక్షుల గుంపొకటి పైకెగసి
నింగికొక హంగునద్దింది.
ఉన్నదున్నట్టు చూడలేని నేను,
ఆ రూపు పోల్చుకోజూసాను !

ఆకాశ విన్యాసం అంతలో ఆపేసి,
తానే వలగా మారిన
ఆ గుంపుకి ఓ చెట్టు చిక్కింది.

మనుషులపై మాయల వల విసిరిన
జాలరి కోసం తరచి చూశాను !

చలిగాలి తాకిడికి స్పర్శ కోల్పోయాను
వెలుపలి హోరుకి మది సద్దు మణిగింది
ఎక్కడినించో ఒక అవ్యక్త మకరందం
నేరుగా నా గుండెలోకి ఇంకింది,
తన ఉనికిని తెలిపింది,
నా ముఖాన ఒక మందహాసమై నిలిచింది !

11/4/09

శరత్ రాగాలు




నిన్న, నేడు, రేఫు ఆగని పరుగులో
అపుడపుడూ దొరికే ఆనందపు జాడకై
ఆరుబయిటకి నేను చూపు సారించాను.

అలవాటుగా తనపాటున మేలుకున్న సూరీడు
ఆకసపు వాకిట్లో ఎర్రటి ముగ్గేసి
పొగమంచు చుట్టాన్ని పలకరించాడు.

పనిపాట ఎరుగని పిల్లగాలులన్నీ
చెట్టు చుట్టూ చేరి చెంగు
చెంగున చిందులేసాయి.

పిల్లగాలుల అల్లరికి పులకించిన చెట్టు
రాలిపోయే ఆకులకు రంగులద్ది మరీ
తోడిచ్చి పంపింది.

బ్రతుకు బండిలో తరలిపోతున్న నన్ను చూసి,
ప్రకృతి పాప ఒక నవ్వు నవ్వింది,
మళ్ళీ మజిలీవరకూ నిలిచిపోయే
చిన్న మాయ చేసి !

10/23/09

కొత్త బ్లాగు

ఏవైనా సరదా సంగతులు రాద్దామని ఇంకో బ్లాగు మొదలెట్టాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ చూడగలరు.

10/13/09

మీనామోహనం

(ఉష గారి జలపుష్పాభిషేకానికి)

కనులు తెరిచే నీవు నిద్దరోతావంట
వినడమేగానీ నే చూడలేదెన్నడూ
రెప్పలు బరువైనా కంట నీరొలికినా
నేల బుట్టిన జీవులం మాకు తప్ప
నీటిలో కొలువైన నీకు లేదెప్పుడూ

తాను మలిచిన సృష్టి వైనమంతటినీ
ఒడిసి పట్టిన నీ రెండు కళ్ళు చూసి
నిన్నూ మలిచిన బ్రహ్మ తానె మురిసి
మూడొంతుల భూమి నీ ఇల్లు జేసె.

అంత గారమనేమో ఎగిరెగిరి పడతావు
ఒడ్డునున్న మాపై ఒక చూపు విసురుతావు
మా లోకంలోకి నువ్వలా తొంగి చూసిన వేళ
ఆనందం ఆశ్చర్యం కొట్టుకొచ్చే కళ్ళ
పిల్లకాయల ఆగని అరుపులు కేరింతలే
నీ వన్నె చిన్నెలకు సాటంటూ ఉంటే !

9/18/09

భావం

తలవని తలపుగ మెదిలిన మొదలుగ
తరలుతు తరుముతు కదిలిన పద ఝరి
పరుగుల వరదలు వలపుల మధువుల,
తగవుల, వగపుల, మురిసిన నగవుల,
తడిసిన కన్నుల, తెలియని తపనల
తడబడు అడుగుల తిరిగిన దారుల
పరి పరి మలుపుల ఎగసిన నురగల
నిండిన బుడగలు భారమునోపక
పగిలిన తొలుతనె వెలువడు వాయువు
వెడలిన తీరుగ భావము విడివడె, భాషకు బలిపడి!

తగదని తెలిసిన తరుణపు తదుపరి
అటు ఇటు వెదికిన మనసుకు తోచెను
గాలికి రెప రెపలాడిన దీపపు,
కనురెప్పలు చేసిన టప టప చప్పుడు.
హోరు గాలిలో దాగు నిశబ్దం,
నీడల నలుపుల వెనుకన వెలుగు,
తొలగిన పద బంధముల సాక్షిగా !

9/8/09

కలత నిద్ర



గుర్తు తెలియని దృశ్యాలేవో కొట్టుకుంటున్న అలికిడికి
ఉన్నట్టుండి రెప్పల తలుపులు తెరుచుకున్నాయి.

ఆపకుండా సుళ్ళు తిరిగిన చెవిలోని శబ్దాలన్నీ
తెరుచుకున్న కళ్ళలోంచి జారుకున్నాయి.

లేని పోని ఊహల్లో రేయంతా ఊయలూగిన మనసు
శరీరపు పంజరంలో తిరిగి బందీ అయింది.

తను అలసిపోయి సోలిన వేళ మనసు చేసిన అల్లరికి
రోజంతా ఒళ్ళు ఇప్పుడు పగ తీర్చుకుంటోంది.

రెంటి బాధా తెలిసీ, నేనెవరో తెలియక
సంధి కోసం మౌనంగా ఎదురు చూస్తున్నాను