7/30/09

చేసింది నా మనసు గుల్ల !

కొన్ని నెలలయింది, నే చూడబట్టి,
అయినా ఎందుకో కొత్తే ఇంకా!
కనబడినప్పుడల్లా పిలుద్దాం అనుకుంటాను,
ఈ లోపు ఎవరో వచ్చి చెడగొడతారు.

క్రితం సారి రుచి మరపు రావట్లేదు,
ఎంత ప్రయత్నించినా మళ్ళీ దొరకట్లేదు.
నవ్వుతూ తుళ్ళుతూ ఎక్కడో మాట్లాడుతుందే తప్ప
నా వైపు మాత్రం అసలు రావట్లేదు !

ఏమనుకుంటారో కాదంటేనని,
తలాడించా అడిగిన అందరికీ,
ఈ రోజు మాత్రం ఇలా కుదరదని ,
వేలు చూపించా తన వైపుకి,
'జన్మ ధన్యమైంద'ని ఎందుకంటారో
తెలుసుకున్నా నేనీ దెబ్బకి !

అదే నవ్వుతో మళ్ళీ వచ్చింది,
నేనడిగింది అలాగే ఇచ్చింది,
అసలా చేతిలో ఏం మహిముందోననే
ఆశ్చర్యం నాకు మిగిల్చింది -
చేసిందిలా నా మనసు గుల్ల,
మా లోకల్ కాఫీషాపు పిల్ల !

7/28/09

జీవిత గమనం

నిన్నటి నించి నేటి వరకు తెరిపి లేని ఈ పరుగులో
ఎన్ని గడిచిన గుర్తులో - తప్పులో, ఒప్పులో !

అభిప్రాయాల రాతి గోడలు అహమే ఎత్తుగా నిలిచిననాడు,
ఆలొచనల హోరుగాలికి మనసున రేగిన తాటాకు చప్పుడు !

గారడీ మాటల చాటున మాటున నలగక తప్పని నిజపు ఛాయలు
కొద్దో గొప్పో కలిగిన జాలికి హద్దులు పెట్టిన స్వార్ధపు జాడలు.

అస్థిత్వపు అనందం ఉనికి వెతికిన దొరకని మనోవనంలో
అడగకనే పూచిన కాగితం పువ్వులు - ఆ పై పై చిరునవ్వులు!

ఐతే మాత్రం -

పలకరించిన ప్రతి ముఖంలో తొంగి చూసిన ఆ 'స్వ'భావం,
అక్కడక్కడా అమాయకత్వం, ఆశే ఎరుగని చిలిపిదనం,
అలసిపోయి అడిగినవాడికి గ్రుక్కెడు నీళ్ళు ఇచ్చే మంచితనం,
మారిన కాలపు నడకేమవనీ, ఇంకా ఇవన్నీ మిగిలున్న వైనం,
జీవిత గమనం సాగించేందుకు నింపెను నాలో కొత్త ఉత్సాహం !

7/21/09

కవిత్వం - కలవరం

గాలి తెమ్మెర తాకినపుడు ఊగిన ఒక పూల చెట్టులా
ఆగి ఆగి నే రాస్తూ ఉన్నా, తెలుసనుకున్న నా భాషలో.

కడలి కాంచిన వేళలో, కనులు కలిసిన హేలలో,
తప్పని తెలిసీ తప్పని తగువులో,
రెండేళ్ళ బుడతడి అమాయకపు నవ్వులో,
రేపు మీద బెంగ లేని చిన్ననాటి ఆటలో,
ఆ ఒంటరి ముసలి గొంతులో వణికిన ఆ మాటలో,
హోరుమన్న గాలిలో, భారమౌతున్న బ్రతుకుల ఘోషలో,
కదిలించని విషయమేది, కరడుగట్టిన కవినైనా, నన్నైనా !

తిరిగి చూస్తే తెలుసుకున్నా తిరుగులేని ఒక నిజాన్ని,
గాలికైనా చెట్టుకైనా ఉన్న స్వేఛ్చ మనకి లేదని,
గాలికూగే చెట్టుని కొమ్మలెపుడూ ఆపబోవని,
భావాలు మనసును ఎంత కదిలించనీ,
పదాల సంకెళ్ళను మాత్రం తెంచలేవనీ, తుంచలేవనీ !

Poetry is an orphan of silence. The words never quite equal the experience behind them. - Charles Simic.

7/19/09

చుట్టూ పక్కల చూడరా..చిన్నవాడా..

సమాజం పట్ల మనిషి బాధ్యత ఏంటో ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చెప్పలేదేమో....
'రుద్రవీణ'లో ఈ నాలుగు ముక్కలూ నా Favorite.

చుట్టూ పక్కల చూడరా..చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా...
కళ్ళ ముందు కటిక నిజం.. కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ద్ధం.. బ్రతుకును కానీయకు వ్యర్ద్ధం
చుట్టూ పక్కల చూడరా..చిన్నవాడా..

స్వర్గాలను అందుకొనాలని.. వడిగా గుడి మెట్లెక్కేవు,
సాటి మనిషి వేదన చూసీ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువూ సంస్కారం అంటే,
గుండె బండగా మార్చేదా..... సాంప్రదాయమంటే,

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు... ఈ సంఘం పండించింది,
గర్వించే ఈ నీ బ్రతుకు...ఈ సమాజమే మలచింది..
ఋణం తీర్చు తరుణం ఒస్తే... తప్పించుకు పోతున్నావా..
తెప్ప తగలబెట్టేస్తావా... ఏరు దాటగానే....!

6/21/09

నొక్కి వక్కాణించినంతన చిక్కెటులని తర్కించుచు చెవులు రిక్కించిన, చిక్కిన నా ప్రక్కవాని జూచి నేనిట్లనియె !

నేను స్కూల్లో ఉన్నప్పుడు మా లెక్కల మాష్టారు Redundancy గురించి ఇలా చెప్పేవారు...

ఎవరో ఒకాయిన తన గొడుగు మీద ' రమణారావు గారు ' అని రాయించుకుని అది వేసుకుని వెళ్తున్నాట్ట. అది చూసి కొంత మంది పోకిరి పిల్లలు వెనకాల పడి......
' రమణారావు గారు గారు ' అని ఏడిపించడం మొదలు పెట్టారుట.

ఒక విషయాన్నో అభిప్రాయాన్నో కుండ బద్దలు కొట్టినట్టో, కొండ బద్దలు కొట్టినట్టో చెప్పడం తప్పు కాదు, మంచిది కూడా.. కానీ అదే కుండని మళ్ళీ మళ్ళీ బద్దలు కొడితేనే ఒస్తుంది చిక్కంతా ! ముందొక మార్కో ముద్రో పడుతుంది.. ఆ తర్వాత మనం ' నొక్కి వక్కాణించిన ' విషయాన్ని ఒదిలేసి దాన్నొక జబ్బుగానో, తెగులుగానో, పిచ్చి గానో అనుకోవడం, చూపించడం, వెక్కిరించడం జరుగుతుంది. ఇది నేను చిన్నప్పటి నించీ చూసినదే.

కావున మిత్రమా ... ' కడ వరకుంగట్టుబడు క్రమమునందున్ దక్క తక్కిన కడ నెక్కడనున్నొక్కటి కంటెను మార్లు నొక్కి వక్కాణించినంతన జిక్కిటులగునే ! '

5/30/09

ప్రజాస్వామ్యం

మన మాటలు దాటును కోటలు.. మరి గొంగళి వేసిన చోటునె
సర్కారులు మార్చేయగలం.. రోడ్ల గుంటలు పూడ్చలేము
పుట్టుకతో లౌకికవాదులం, ఆ పేరుతో కులమే ఉంటే !

రౌడీలు, సినిమా వాళ్ళు, దళారులు, ఘన వ్యాపారులు
పొషిస్తాం ఎవ్వరినైనా, మన తిండికి లేపోతేనేం ?
మా ఆట మా ఇష్టమంటూ సృష్టిస్తాం బొమ్మలు కొన్ని
అలసత్వం పెరిగే కొద్ది..ఆడుతాము అవి ఆడిస్తే !

అన్నదాత ఉరిపాలైనా, పల్లెలు పల్లెలు మాయం ఐనా
తిండి గింజలు, ఇంటి అద్దెలు, స్కూలు ఫీజులు, మందు బిళ్ళలు
నిరుటికి రెండింతలైనా, మూడింతలైనా

కులమంటూ, ప్రాంతం అంటూ, మతమంటూ, దైవం ఆంటూ
ఏ మంటలు ఎందుకు మండినా, ఎవరెట్లా విషం కక్కినా -

తాపీగా పేపర్ చూస్తాం, వీలుంటే డిస్కస్ చేస్తాం,
మన దాకా రాకపొతే ఓపికగా విశ్లేషిస్తాం
పొరపాటున ఒస్తే మాత్రం, ఎరిగుందాం ఏకాకులమని !

గర్వంగా చాటుకున్న ఈ ప్రజాస్వామ్య ప్రయాణంలో
ఒకరికైనా లక్షలకైనా..అసలంటూ జరిగిన అన్యాయంలో
బాధ్యత మన ప్రతి ఒక్కరిదీ...

ఇప్పటికైనా తెలుసుకుందాం..ప్రజస్వామ్యం అంటే...
ఐదేళ్ళకి ఒక సారి ముద్దర వేసి మిన్నకుండడం కాదు,
ఇది ఒక నిరంతర ఉద్యమం , నిత్య పోరాటం అని !

7/2/08

అనుభవం

మనం కలిసే ప్రతి మనిషిలో మన లక్షణాలు ఒకటో రెండో.. కనిపించడం... ఎక్కువగా అవి మనలో మనకే నచ్చనివిగా ఉండడం...
ఒకప్పుడు మనం చేసిన పనులు.. ఆ సమయంలో ఎంత సబబుగా కనిపించాయో... ఇప్పుడు అంత కంటే తప్పుగా అనిపించడం...
ఒకప్పుడు ఎంతో ముఖ్యంగా అనిపించిన విషయాలు.. ఇప్పుడు చిన్నవిగా కనిపించడం...