11/18/09

అవ్యక్తం

ఆకుల భేషజాలని రాల్చేసి
తేలికపడి చెట్టు నిలుచుంది.
తగని తలపులన్నీ తలకెత్తుకుని,
బరువెక్కి నేను చూస్తున్నాను.

గమ్యపు రుచి మరిగిన కాట్ల కుక్కల్లా
కార్లు పరిగెడుతున్నాయి.
జీవితమే ఒక మజిలీ అని ఎందుకన్నారో
అన్న ప్రశ్న మెదిలింది.

పక్షుల గుంపొకటి పైకెగసి
నింగికొక హంగునద్దింది.
ఉన్నదున్నట్టు చూడలేని నేను,
ఆ రూపు పోల్చుకోజూసాను !

ఆకాశ విన్యాసం అంతలో ఆపేసి,
తానే వలగా మారిన
ఆ గుంపుకి ఓ చెట్టు చిక్కింది.

మనుషులపై మాయల వల విసిరిన
జాలరి కోసం తరచి చూశాను !

చలిగాలి తాకిడికి స్పర్శ కోల్పోయాను
వెలుపలి హోరుకి మది సద్దు మణిగింది
ఎక్కడినించో ఒక అవ్యక్త మకరందం
నేరుగా నా గుండెలోకి ఇంకింది,
తన ఉనికిని తెలిపింది,
నా ముఖాన ఒక మందహాసమై నిలిచింది !

11/4/09

శరత్ రాగాలు




నిన్న, నేడు, రేఫు ఆగని పరుగులో
అపుడపుడూ దొరికే ఆనందపు జాడకై
ఆరుబయిటకి నేను చూపు సారించాను.

అలవాటుగా తనపాటున మేలుకున్న సూరీడు
ఆకసపు వాకిట్లో ఎర్రటి ముగ్గేసి
పొగమంచు చుట్టాన్ని పలకరించాడు.

పనిపాట ఎరుగని పిల్లగాలులన్నీ
చెట్టు చుట్టూ చేరి చెంగు
చెంగున చిందులేసాయి.

పిల్లగాలుల అల్లరికి పులకించిన చెట్టు
రాలిపోయే ఆకులకు రంగులద్ది మరీ
తోడిచ్చి పంపింది.

బ్రతుకు బండిలో తరలిపోతున్న నన్ను చూసి,
ప్రకృతి పాప ఒక నవ్వు నవ్వింది,
మళ్ళీ మజిలీవరకూ నిలిచిపోయే
చిన్న మాయ చేసి !