7/30/09

చేసింది నా మనసు గుల్ల !

కొన్ని నెలలయింది, నే చూడబట్టి,
అయినా ఎందుకో కొత్తే ఇంకా!
కనబడినప్పుడల్లా పిలుద్దాం అనుకుంటాను,
ఈ లోపు ఎవరో వచ్చి చెడగొడతారు.

క్రితం సారి రుచి మరపు రావట్లేదు,
ఎంత ప్రయత్నించినా మళ్ళీ దొరకట్లేదు.
నవ్వుతూ తుళ్ళుతూ ఎక్కడో మాట్లాడుతుందే తప్ప
నా వైపు మాత్రం అసలు రావట్లేదు !

ఏమనుకుంటారో కాదంటేనని,
తలాడించా అడిగిన అందరికీ,
ఈ రోజు మాత్రం ఇలా కుదరదని ,
వేలు చూపించా తన వైపుకి,
'జన్మ ధన్యమైంద'ని ఎందుకంటారో
తెలుసుకున్నా నేనీ దెబ్బకి !

అదే నవ్వుతో మళ్ళీ వచ్చింది,
నేనడిగింది అలాగే ఇచ్చింది,
అసలా చేతిలో ఏం మహిముందోననే
ఆశ్చర్యం నాకు మిగిల్చింది -
చేసిందిలా నా మనసు గుల్ల,
మా లోకల్ కాఫీషాపు పిల్ల !

7/28/09

జీవిత గమనం

నిన్నటి నించి నేటి వరకు తెరిపి లేని ఈ పరుగులో
ఎన్ని గడిచిన గుర్తులో - తప్పులో, ఒప్పులో !

అభిప్రాయాల రాతి గోడలు అహమే ఎత్తుగా నిలిచిననాడు,
ఆలొచనల హోరుగాలికి మనసున రేగిన తాటాకు చప్పుడు !

గారడీ మాటల చాటున మాటున నలగక తప్పని నిజపు ఛాయలు
కొద్దో గొప్పో కలిగిన జాలికి హద్దులు పెట్టిన స్వార్ధపు జాడలు.

అస్థిత్వపు అనందం ఉనికి వెతికిన దొరకని మనోవనంలో
అడగకనే పూచిన కాగితం పువ్వులు - ఆ పై పై చిరునవ్వులు!

ఐతే మాత్రం -

పలకరించిన ప్రతి ముఖంలో తొంగి చూసిన ఆ 'స్వ'భావం,
అక్కడక్కడా అమాయకత్వం, ఆశే ఎరుగని చిలిపిదనం,
అలసిపోయి అడిగినవాడికి గ్రుక్కెడు నీళ్ళు ఇచ్చే మంచితనం,
మారిన కాలపు నడకేమవనీ, ఇంకా ఇవన్నీ మిగిలున్న వైనం,
జీవిత గమనం సాగించేందుకు నింపెను నాలో కొత్త ఉత్సాహం !

7/21/09

కవిత్వం - కలవరం

గాలి తెమ్మెర తాకినపుడు ఊగిన ఒక పూల చెట్టులా
ఆగి ఆగి నే రాస్తూ ఉన్నా, తెలుసనుకున్న నా భాషలో.

కడలి కాంచిన వేళలో, కనులు కలిసిన హేలలో,
తప్పని తెలిసీ తప్పని తగువులో,
రెండేళ్ళ బుడతడి అమాయకపు నవ్వులో,
రేపు మీద బెంగ లేని చిన్ననాటి ఆటలో,
ఆ ఒంటరి ముసలి గొంతులో వణికిన ఆ మాటలో,
హోరుమన్న గాలిలో, భారమౌతున్న బ్రతుకుల ఘోషలో,
కదిలించని విషయమేది, కరడుగట్టిన కవినైనా, నన్నైనా !

తిరిగి చూస్తే తెలుసుకున్నా తిరుగులేని ఒక నిజాన్ని,
గాలికైనా చెట్టుకైనా ఉన్న స్వేఛ్చ మనకి లేదని,
గాలికూగే చెట్టుని కొమ్మలెపుడూ ఆపబోవని,
భావాలు మనసును ఎంత కదిలించనీ,
పదాల సంకెళ్ళను మాత్రం తెంచలేవనీ, తుంచలేవనీ !

Poetry is an orphan of silence. The words never quite equal the experience behind them. - Charles Simic.

7/19/09

చుట్టూ పక్కల చూడరా..చిన్నవాడా..

సమాజం పట్ల మనిషి బాధ్యత ఏంటో ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చెప్పలేదేమో....
'రుద్రవీణ'లో ఈ నాలుగు ముక్కలూ నా Favorite.

చుట్టూ పక్కల చూడరా..చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా...
కళ్ళ ముందు కటిక నిజం.. కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ద్ధం.. బ్రతుకును కానీయకు వ్యర్ద్ధం
చుట్టూ పక్కల చూడరా..చిన్నవాడా..

స్వర్గాలను అందుకొనాలని.. వడిగా గుడి మెట్లెక్కేవు,
సాటి మనిషి వేదన చూసీ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువూ సంస్కారం అంటే,
గుండె బండగా మార్చేదా..... సాంప్రదాయమంటే,

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు... ఈ సంఘం పండించింది,
గర్వించే ఈ నీ బ్రతుకు...ఈ సమాజమే మలచింది..
ఋణం తీర్చు తరుణం ఒస్తే... తప్పించుకు పోతున్నావా..
తెప్ప తగలబెట్టేస్తావా... ఏరు దాటగానే....!